భావిభారత సూపర్ స్టార్స్

53

కొత్త నీరొచ్చినప్పుడు పాత నీరు కిందకి పోవడం సహజంగా జరిగేదే. సినిమాల్లో కావొచ్చు, రాజకీయాల్లో కావొచ్చు.. కొత్తవారికి పాతవారు దారివ్వాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్నదిదే. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్స్ స్థానంలో కొత్త స్టార్స్ వస్తున్నారు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి కుర్రోళ్ళు.. పైన పేర్కొన్న సీనియర్ హీరోలకు సవాలు విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ సీనియర్ హీరోల ఉనికికి ప్రమాదమేమీ ఉండకపోవచ్చు కానీ.. వీళ్ళ ధాటికి తట్టుకొని మరికొన్నాళ్లు రాజ్యమేలడం మాత్రం కష్టమే.

రణవీర్ సింగ్: ‘బ్యాండ్ బాజా బారాత్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రణవీర్.. తొలిచిత్రంతోనే మంచి హిట్ కొట్టి, తను హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. దీపికతో తొలిసారి ఆటను జత కట్టిన ‘రామ్ లీలా’ అతనిలో ఓ సూపర్ స్టార్ ఉన్నాడని చెప్పకనే చెప్పింది. ఆ చిత్రం తర్వాత కూడా రణవీర్ ఖాతాలో కొన్ని హిట్లున్నప్పటికీ.. దీపికతో నటించిన బాజీరావు మస్తానీ, పద్మావత్’ చిత్రాలు అతనికి తిరుగులేని విజయాలు అందించాయి. దీపికను పెళ్లాడడం అతని పాపులారిటీని మరింత పెంచింది. ‘సింబా’ సూపర్ హిట్ అవ్వడం అందుకు మంచి ఉదాహరణ. రణవీర్ నటించిన గుల్లి భాయ్ త్వరలో విడుదల కానుంది.

రణబీర్ కపూర్: రిషి కపూర్ తనయుడిగా తెరంగేట్రం చేసిన రణబీర్ తొలి చిత్రం ‘సావరియా’ సోసో అనిపించుకుంది. ‘వేక్ అప్ సిద్, అజాబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, బర్ఫీ, ఏ జవానీ హై దివానీ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకొని.. సూపర్ స్టార్ డమ్ కి చేరువవుతున్న తరుణంలో.. కథల ఎంపికలో అతను చూపిన ఉదాసీనత అతని కెరీర్ పై ప్రభావం చూపింది. అయితే.. రణబీర్ నటించిన ‘సంజు’ అతనికి తిరుగులేని విజయం అందివ్వడమే కాదు.. నేటి యువతరంలో అతనికి సాటి రాగల హీరోలు లేరని చాటి చెప్పింది. రణబీర్ నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర, శంషేరా’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

రాజ్ కుమార్ రావు: ఎల్.ఎస్.డి, రాగిణి ఎంఎంఎస్, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, కైపోచి, క్వీన్, బారైలీ కి బర్ఫీ, స్త్రీ’ వంటి చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న రాజ్ కుమార్ రావు కూడా నటన పరంగానే కాదు.. కథల ఎంపిక పరంగానూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మెంటల్ హై క్యా, మేడ్ ఇన్ చైనా, షిమ్లా మిర్చి చిత్రాలు విడుదల కానున్నాయి.

ఆయుష్మాన్ ఖురాన్: ఈరోజున ఆయుష్మాన్ ఖురానాకి యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందంటే.. అతను నటించిన సినిమా అంటే చాలు.. ధియేటర్స్ కి క్యూ కడుతున్నారు. తొలి చిత్రం ‘విక్కీ డోనర్’ మొదలుకుని.. గతేడాది విడుదలైన ‘అందాదున్, బధాయిహొ’ వరకు అతను నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కథల ఎంపికలో అతను చూపించే వైవిధ్యం అతనికి లెక్కకు మిక్కిలిగా అభిమానులని తెచ్చిపెడుతోంది.

వరుణ్ ధావన్: ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడైన వరుణ్ ధావన్ కి కూడా ఇప్పటివరకు అపజయం లేదు. తొలిచిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదలుకొని మొన్నటి అక్టోబర్, సూయి దాగా’ వరకు వరస విజయాలతో దూసుకుపోతున్నాడు వరుణ్ ధావన్.

టైగర్ ష్రాఫ్: ప్రముఖ హీరో జాకీ ష్రాఫ్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్.. బాఘీ, బాఘీ-2 చిత్రాలతో సూపర్ హిట్స్ సాధించాడు. పైన పేర్కొన్న హీరోల్లో రణవీర్ సింగ్ కి తప్ప మిగతా హీరోలకు లేని బాడీ, ఫైటింగ్ స్కిల్స్ టైగర్ సొంతం. ఇదే ఊపులో టైగర్ ఖాతాలో మరో రెండు మూడు హిట్స్ పడితే.. ఇక స్టార్ డమ్ కి తిరుగుండదు.