ఏం రాశాడ్రా’ అనిపించుకోవడానికి రాక్షసుడిలా కష్టపడతా!!

100

తెలుగు సినిమా పాఠకులకు, ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు ‘పులగం చిన్నారాయణ’. ఫిలిం జర్నలిస్ట్ గా, పీఆర్వోగా, సుప్రసిద్ధ దినపత్రిక ‘సాక్షి’ సినిమా సెక్షన్ ఇంచార్జ్ గా, ప్రఖ్యాతి గాంచిన పలు సినిమా పుస్తకాల రచయితగా, వర్ధమాన గీత రచయితగా, డైలాగ్ రైటర్ గా ‘పులగం చిన్నరాయణ’ పేరు తెలియని ప్రేక్షకులు, పాఠకులు ఎవరూ ఉండరు!

చిన్నారాయణ తాజాగా రాసిన పుస్తకం ఇప్పటికే ఆయనకు గల పేరును మరింత పెంచుతోంది. ఆ పుస్తకం పేరు ‘మాయాబజార్ మధుర స్మృతులు’. సాక్షాత్తూ మన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. తనకుండే బిజీ షెడ్యూల్ లోనూ ఈ పుస్తకాన్ని చదివి, దాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ఒక లేఖ రాశారంటే.. దాన్నిబట్టి ఆ పుస్తకంలోని విషయ సంపదను అర్ధం చేసుకోవచ్చు!

‘బీయింగ్ విత్ ఏ విన్నర్ మేక్స్ యు ఏ విన్నర్’ అనే ఆంగ్ల సామెత పులగంకి అక్షరాలా అన్వయిస్తుంది. విజేతలతో కలిసి చేస్తున్న అయన స్ఫూర్తిదాయక ప్రయాణం ఆయన్ను కూడా విజేతను చేసింది. నితిన్, రామ్, వరుణ్ తేజ్, కార్తికేయ (ఆర్ ఎక్స్ 100) వంటి హీరోల తొలి చిత్రాలకు ప్రచార బాధ్యతలు నిర్వహించిన చిన్నారాయణ ఇప్పటివరకు 300 పై చిలుకు చిత్రాలకు పీఆర్వోగా పని చేశారు. పూరి జగన్నాధ్, చంద్రసిద్ధార్ద, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి దర్శకుల మొదటి చిత్రాలకు కూడా సదరు బాధ్యతలు సమర్ధవంతంగా నిభాయించారు. ఒక్క చిరంజీవి మినహా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్వంటి సూపర్ స్టార్స్ అందరి సినిమాలకు పీఆర్వోగా పని చేసి, ఇంకా చేస్తూ వారి మన్ననలను అందుకుటున్న చిన్నారాయణ.. సంభాషణల రచయితగా, కథా రచయితగా పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతూ.. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. మూడు పర్యాయాలు ప్రతిష్టాత్మక నంది అవార్డులు కొట్టేసిన ఈ ప్రతిభాశాలి మాత్రం ఇప్పటివరకు తాను ఏదో సాధించానని అనుకోవడం లేదని.. భవిష్యత్తులో ఏ కొంచెమైనా సాధించడానికి ఇదంతా ఒక పునాదిగా మాత్రమే భావిస్తున్నానని వినయంగా అంటారు. ‘తనను తాను తగ్గించుకొనెడివాడు హెచ్చించబడెదడు’ అనే బైబిల్ సూక్తిని ఈ బహుముఖ ప్రతిభాశాలి నరనరాన జీర్ణించుకున్నట్లున్నాడు చూస్తుంటే!

చిన్నారాయణ విరచిత తాజా పుస్తకం ‘మాయాబజార్ మధుర స్మృతులు’ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరి మన్ననలు దండిగా పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని.. ఆయన రాసిన పుస్తకాలపై ఓ ప్రత్యేక విహంగ వీక్షణం!!

1. జంధ్యామారుతం: ‘హాస్యబ్రహ్మ’ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సుప్రసిద్ధ దర్శకుడు జంధ్యాల దర్సకత్వంలో రూపొందిన మొత్తం 39 సినిమాలకు సంబంధిచిన సంగతులపై సమగ్రంగా వెలువడిన ఈ పుస్తకం.. పులగం చిన్నారాయణ కలం నుంచి జాలువారిన తొలి పుస్తకం. హాసం పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది!

2. ఆనాటి ఆనవాళ్లు: తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మొదలుకొని ‘మౌన పోరాటం’ వరకు.. 1931 నుంచి 1980 వరకు వచ్చిన వేల చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటి 75 సినిమాలను ఎంపిక చేసి.. ఆ చిత్రాల తాలూకు ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు. ఆచంద్రతారార్కం నిలిచిపోయే ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన విఖ్యాత విజయా సంస్థకు వారసులైన బి.విశ్వనాథరెడ్డి విజయ పబ్లికేషన్స్ పై ఈ పుస్తకాన్ని వెలువరించారు. చిన్నారాయణకు తొలి నందిని తెచ్చిన పుస్తక రాజమిది కావడం గమనార్హం!

aanati aanavallu
aanati aanavallu

3. సినీపూర్ణోదయం: సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణ కమలం కళాఖండాల్ని తెలుగు ప్రేక్షకులకు కానుకగా ఇచ్చిన పూర్ణోదయా క్రియేషన్స్ వారి మొత్తం తొమ్మిది సినిమాలపై (నవరత్నాలు) వెలువడిన పుస్తకమిది. చిన్నప్పటినుచి చూస్తూనే ఉన్న సినిమాలకు సంబంధించి తెర వెనుక సంగతులకు అద్దం పట్టే ఈ పుస్తకాన్ని క్రియేటివ్ లింక్స్ వారు ప్రచురించారు!

4. స్వర్ణయుగ సంగీత దర్శకులు: ఘంటసాల గొప్ప గాయకుడని అందరికీ తెలుసు. కానీ ఆయన ఏ ఇతర గొప్ప సంగీత దర్శకులకూ తీసిపోనంత గొప్ప సంగీత దర్శకుడు కూడా ఆయనలో ఉన్నాడని ఎంతమందికి తెలుసు? ఇదే కాదు.. రోజూ మన మనసుల్ని పరవిశింపజేసే ఎన్నెన్నో మహాద్భుత గీతాలకు సృజన చేసిన మహానుభావుల గురించి కూడా తెలుసుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పులగం చిన్నరాయణ వెలువరించిన ‘స్వర్ణయుగంలో సంగీత దర్శకులు’ పుస్తకం చదివి తీరాల్సిందే. సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి లైబ్రరీలో చోటు చేసుకుని, ఇప్పటికే పలు మార్లు రీప్రింట్ అయిన ఈ పుస్తకాన్ని ప్రవాస తెలుగు ప్రముఖులు చిమట శ్రీనివాస్ ప్రచురించారు. తొలి తెలుగు సంగీత దర్శకుడు హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి (భక్త ప్రహ్లాద) మొదలుకొని.. రెండు మూడు దశాబ్దాల పాటు తమిళ, తెలుగు సినిమా సంగీతాన్ని శాసించిన ఇళయరాజా వరకు 50 మంది సంగీత దర్శకులకు అక్షరాభిషేకం చేసిన పుస్తకమిది. గాన గంధర్వుడు బాల సుబ్రహమణ్యం ఎంతో ఇష్టంగా ప్రూఫ్ రీడింగ్ చేసిన పుస్తకమిది. ఇక్కడ ఆయన చేసిన ప్రూఫ్ రీడింగ్ అక్షర దోషాలు కాదు.. విషయం దోషాలు. ఇదొక్కటే చాలదూ ఈ పుస్తక విశిష్టత గురించి చెప్పడానికి? ఈ పుస్తకం ఆధారంగా ఎవరైనా డాక్టరేట్ తీసుకోవచ్చని సినారె వంటి మహాకవి వ్యాఖ్యానించి ఉండడం.. ఈ పుస్తకానికి దక్కిన మరో మహా గౌరవం!

5. పసిడితెర: సినిమాలకు సీక్వెల్స్ అందరికీ తెలుసు. కానీ పుస్తకాలకు కూడా సీక్వెల్స్ ఉంటాయా? చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ ఘనతకు పుస్తక రూపమే ‘పసిడి తెర’. అశేష పాఠకుల ఆదరాభిమానాలు పొందిన ‘ఆనాటి ఆనవాళ్లు’కు సీక్వెల్ గా వచ్చి మెప్పించిన పుస్తకమిది. తెలుగు సినిమాలల్లో వంద అత్యుత్తమ చిత్ర రాజాలను ఎంపిక చేసి, వాటి విశేషాల సమాహారంగా వెలువడిన ఈ పుస్తకం చిన్నారాయణకు మరింత కీర్తి తెచ్చి పెట్టడమే కాకుండా.. రెండో నందిని తెచ్చి పెట్టింది. ఈ పుస్తకం విజయ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది!

MayaBazar MadhuraSmrthulu6. సినిమా వెనుక స్టోరీలు: ఇండస్ట్రీ హిట్ గా నిలిచి.. మహేష్ బాబును సూపర్ స్టార్ గా చేసిన సినిమాలో రవితేజను తీసుకోవాలని అనుకున్నారని ఎంతమందికి తెలుసు? అంతేకాదు ఆ సినిమాకి మొదటగా అనుకున్న పేరు కూడా ‘పోకిరి’ కాదు. ‘ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’. పలు సూపర్ హిట్ సినిమాల వెనుక స్టో’రీలు’ వివరించే పుస్తకం ‘సినిమా వెనుక స్టోరీలు’. ఒక సినిమా వెనుక ఓ దర్శకుడు పడే ప్రసవవేదనకు అక్షర రూపమిచ్చే ఈ పుస్తకం సాహితీ ప్రచురణల ద్వారా వెలువడింది!

7. మాయాబజార్ మధుర స్మృతులు: తెలుగు సినిమాపైనే కాదు.. తెలుగు ప్రేక్షకుడిపై చెరగని సంతకం ‘మాయాబజార్’. నడిచే నట విశ్వ విద్యాలయాలుగా కొనియాడబడే ఎన్టీఆర్, ఏయన్నార్, యస్వీయార్, సావిత్రి వంటి హేమాహేమీలు నటించిన ఈ కళాఖండంపై వెలువరించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రచురణ ఇది. ఒక పుస్తకంతో పాటు.. మాయాబజార్ సినిమాలో నటించిన, పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల మధురానుభూతులను వీడియో రూపంలోనూ అందించడం ఈ పుస్తకం ప్రత్యేకత. పుస్తక ప్రచురణకు సంబంధించి ఇదొక అరుదైన ప్రక్రియ. ముందే చెప్పుకున్నట్లు.. ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తి తీరిక చేసుకొని ఈ పుస్తకాన్ని చదవడం.. ఆపై మరికొంచెం తీరిక కల్పించుకొని ఈ పుస్తకాన్ని మెచ్చుకుంటూ లేఖ రాయడం బట్టి ఈ పుస్తకం గొప్పతనం అవగతమవుతుంది. ‘మాయాబజార్ మధుర స్మృతులు’ చదివాక, వీక్షించాక.. ‘మాయాబజార్’ సినిమా మనకు మరింత నచ్చుతుందంటే అందులో రవ్వంతైనా అతిశయోక్తి ఉండదు.

ఇప్పటివరకు పలు సినిమాలకు పది పన్నెండు పాటలు రాసిన పులగం ‘ప్రేమ ఒక మైకం, బ్లఫ్ మాస్టర్’ చిత్రాలకు తనదయిన శైలిలో సంభాషణలను అందించారు. ‘మాయాబజార్’ సినిమాలో పింగళి నాగేంద్ర రాసిన డైలాగుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నట్లుగా.. తను రాసే డైలాగుల గురించి కూడా మాట్లాడుకోవాలన్నదే తన కోరికని, అందుకోసం తానూ ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమేనని అంటారు చిన్నారాయణ!

MayaBazar MadhuraSmrthulu

కొసమెరుపు: బలహీనతలను తిరుగులేని బలాలుగా మార్చుకోవడం ఎలాగో పులగం చిన్నారాయణ నుంచి నేర్చుకోవాలి. సినిమాలు, ‘సినిమాలు, పుస్తకాలు’ ఆయన బలహీనతలు.. ఆయనకున్నరెండే రెండు వ్యసనాలు. మామూలుగా అయితే బలహీనతలు, వ్యసనాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. కానీ.. ఈ రెండు వ్యసనాలను, బలహీనతలను తన బలగాలుగా మార్చుకోగలిగిన ధన్యజీవి పులగం!!