‘యాత్ర’ రివ్యూ | Telugu24 Rating: 2.75/5

310
 వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పదవీయోగం కల్పించిన పాదయాత్రపై తీసిన చిత్రం ‘యాత్ర’. ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్ధకుల ముందుకు వచ్చింది. పాఠశాల, ఆనందోబ్రహ్మ చిత్రాల దర్శకుడు మహీ రాఘవ దర్శకత్వంలో 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు, రావు రమేష్, సుహాసిని, నాజర్, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వి, తోటపల్లి మధు’ జీవా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
కథ: కథ మీద కంటే కథనాన్ని నమ్ముకుని తీసిన చిత్రమిది. పాదయాత్రకు వైస్సార్ ను ప్రేరేపించిన పరిస్థితులు, ఆయన చేపట్టిన పాదయాత్ర ఒక రాజకీయ నాయకుడిగా ఆయనపై చూపిన ప్రభావం నేపథ్యంలో నడిచి.. ముఖ్యమంత్రి వైస్సార్ ప్రమాణ స్వీకారం చేయడం… ఆ తర్వాత హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలవ్వడంతో సినిమా ముగుస్తుంది.
నటీనటులు-సాంకేతిక నిపుణుల పనితీరు:
మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? తనదైన శైలిలో అద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే వైస్సార్ తండ్రి రాజారెడ్డిగా జగపతిబాబు, ఆయన గురువు పాత్రలో నాజర్, వైస్సార్ చేవెళ్ల చెల్లెమ్మగా పిలుచుకున్న సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని తదితరులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదన్న విషయం  ప్రతి ఫ్రేము లోనూ కనబడుతుంది.
మైనస్సులు: ప్రస్తుతం వైస్సార్ కాంగ్రెస్ లో ఉండి.. తెలుగుదేశం పార్టీపై ప్రతి రోజూ విరుచుకుపడే పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వి మన (తెలుగు) దేశం నాయకులుగా చూపించడం కాస్తంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ను వైస్సార్ అడుగడుగునా ధిక్కరించినట్లు చూపడం కూడా కొంచెం అతిగానే అనిపిస్తుంది. అలాగే.. ఇది వైస్సార్ బయోపిక్ కాదని చెప్పిన దర్శకుడు.. వైస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం.. చనిపోయేవరకు ఒరిజినల్ వైస్సార్ క్లిప్పింగ్స్ వాడడంలో రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తాయి. వైస్సార్ వాయిస్ మరీ సుపరిచితం కావడంతో మమ్ముట్టి ఓన్ వాయిస్ అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది.
ప్లస్సులు: 
ప్రతి పాత్రకూ పర్ఫెక్ట్ కాస్టింగ్ చేయడం ఈ చిత్రానికి పెద్ద బలం. ఈ విషయంలో దర్శకుడు మహి వి.రాఘవకు నూటికి తొంభై మార్కులు పడతాయి. అలాగే భావోద్వేగాలను పండించడంలోనూ తను తన ప్రతిభ చాటుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసి, స్వర పేటిక దెబ్బతిన్న రైతు తనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. అతను మాట్లాడలేకపోతున్నాడని డాక్టర్ చెబుతుంటే.. “నాకు వినబడుతున్నాదయ్యా” అని మమ్ముట్టితో చెప్పించిన డైలాగ్ దర్శకుడి ప్రతిభకు మచ్చుతునకగా చెప్పొచ్చు.
చివరిగా…  రానున్న ఎన్నికల్లో వైస్ జగన్ కు రాజకీయంగా ఉపయోగపడేలా రూపొందిన ఈ చిత్రం.. ఆ ప్రయత్నంలో చాలమేర సఫలీకృతం అయినట్లే చెప్పొచ్చు!!

కాబట్టి తెలుగుదేశం సానుభూతిపరులకు మాత్రం ఈ చిత్రం ఎంతమాత్రం నచ్చదు. పైగా ఒక సన్నివేశంలో.. సందర్భంలో ఏమాత్రం సంబంధం లేకుండా.. ఓటుకు నోటు వ్యవహారం గుర్తుకు తెస్తూ.. చంద్రబాబునాయుడు వాయిస్ ను పోలిన వాయిస్ ను వినిపించదాన్ని వాళ్ళు ఎంతమాత్రం జీర్ణించుకోలేరు

Telugu24 Rating: 2.75/5