గుండె సమస్యకు కారణాలు

గుండెపోటు అనగానే వృద్ధులు కళ్లముందు మెదులుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 25 నుంచి 30 ఏళ్ల వయసువారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇందుకు కారణాలు మనలో, మనచుట్టూనే ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోగలిగితే గుండె సమస్యల నుండి తప్పించుకోవచ్చునంటున్నారు వైద్యులు. గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా, ఆరోగ్యకరంగా, ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండూ క్రమం తప్పుతాయో వాటి ప్రభావం శరీరం మీద పడి ఆరోగ్య వ్యవస్థ గాడితప్పుతుంది. కాలంతోపాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వేళకు తిండి, నిద్ర కరువయ్యాయి. శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడిదొడుకులకు గురవుతూ క్రమేపీ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమయిపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారి తీస్తుంది. సమస్య తలెత్తినపుడు సకాలంలో గుర్తించి చికిత్స చేసే వీలుంది.

Heart-Problems-india
Heart-Problems-india

అయితే అసలు సమస్యే తలెత్తకుండా చూసుకోగలిగితే చికిత్సతో పని లేకుండానే ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి గుండె సమస్యలకు కారణమయ్యే అంశాలను తెలుసుకుని వాటిని నియంత్రించాలి. ఒకవేళ గుండె సమస్య మొదలైనా దాన్ని ప్రారంభంలోనే గుర్తించగలిగితే గుండె కండరాలు మరింత దెబ్బ తినకుండా చికిత్సతతో నియంత్రించవచ్చు. కాబట్టి గుండె సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హృద్రోగ లక్షణాలు ఏవంటే.. తేలికగా అలసిపోవటం, బరువు పనులు చేసినా, మెట్లు ఎక్కుతున్నా, పరిగెత్తు తున్నా, వ్యాయామం చేస్తున్నా అలసట రావటం. గుండె వేగంగా కొట్టుకోవటం. పని చేస్తున్నప్పుడు వాంతి వచ్చినట్లు అనిపించటం, విపరీతంగా చెమట పట్టడం. వరల్డ్‌ బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన ఒక సర్వేలో ఏ జబ్బు వల్ల స్త్రీలు ఎక్కువగా మరణిస్తున్నారనే ప్రశ్నకు రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ అనే సమాధానమే వచ్చింది. కానీ నిజం ఇందుకు విరుద్ధంగా ఉంది.

రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్ల మరణించే స్త్రీల సంఖ్య 15 నుంచి 20 శాతం ఉంటే గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయే స్త్రీల సంఖ్య 60 నుండి 80 శాతం ఉంటోం ది. ఈ సర్వేను బట్టి మహిళల్లో గుండె సమస్యల గురించిన అవగాహన తక్కువని తెలుస్తోంది. గుండెనొప్పి స్త్రీలకు రావటం అరుదనే అపోహ అందరిలోను ఉంది. కానీ పురుషులతో సమానంగా స్త్రీలకూ గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన జీవనశైలులు, వృత్తులు, అలవాట్లు అనుసరిస్తున్నప్పుడు ఇద్దరికీ గుండె సమస్యలు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి. గుండె కవాటాలు, కండరాల సమస్యలు, పుట్టుకతో గుండెలో లోపాలు.. ఇలా తలెత్తే గుండె సమస్యలకు మూలాలెన్నో ఉంటాయి.

హృదయ కండరాలు బాగా లావ్ఞగా తయారై, భవిష్యత్తులో గుండెనొప్పులు, కార్డియాక్‌ డెత్‌, గుండె కొట్టుకునే వేగంలో అవకతవకలు లాంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే అథెరోస్క్లిరోసిస్‌ వలన పెద్ద వయసు వారిలో వచ్చే గుండెనొప్పి యుక్త వయస్కుల్లోనూ రావచ్చు. పెద్ద వాళ్లలో గుండె నొప్పి, గుండెనొప్పితో కూడిన గుండె సమస్యలు కనిపిస్తే చిన్న వయసుల వారిలో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌, కవాటాల సమస్యలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జన్యుపరంగా వచ్చే కార్డియోమయోపతి మొదలైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.

రాబోయే పదేళ్లలో గుండెపోటు వచ్చే అవకాశాలను గుర్తించి అప్రమత్తం చేసే యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. హార్ట్‌ రిస్క్‌ స్కోర్‌ లేదా ఎథిలోస్ల్కిరోటిక్‌ కార్డియో వాస్క్యులర్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ అనే ఈ యాప్స్‌ను ఉపయోగించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు పూరించటం ద్వారా గుండెజబ్బు వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో శరీర బరువ్ఞ, కొలెస్ట్రాల్‌ పరిమాణం, దురలవాట్లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. వీటికి మనమిచ్చే సమాధానాలను బట్టి పదేళ్ల హార్ట్‌ రిస్క్‌ స్కోరు, అయిదేళ్ల హార్ట్‌ రిస్క్‌ స్కోరు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుసరించి జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా గుండెపోటును నియంత్రించుకోవచ్చు.

"data-width="100%" data-numposts="5">