స్లీప్‌ మోడ్‌ – నిద్ర మంచిదా.. కాదా..?

ఉరుకుల పరుగుల జీవితంలో మనకు కావాల్సిన దానికన్నా అనవసరమైనవే ఎక్కువ చేస్తున్నాము. జీవగడియారం సరిగా నడవడానికినిద్ర అవసరం ఎంత ఉందో చాలా అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయాన్ని కాస్త వివరంగా తెలుసుకుందాం.

Woman sleeping at home in her bed

ఎవరెవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి…
అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమి -ప్రభావం
నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుంది. నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుంది. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుంది.

ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుందట.

నిద్రలేమి ప్రభావం మొదటగా మెదడు పనితీరుపై పడుతుంది. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయట, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయట.సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయట.
ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

నిద్రలేమి సమస్య ఎవరికి ఎక్కువ?
నిద్రలేమి సమస్య వయసు ఆధారంగా, స్త్రీ, పురుషుల్లో భిన్నంగా ఉంటుంది. బ్రిటన్‌లో చేసిన ఓ పరిశోధనలో రెండు వేల మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనలో మహిళలు ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది.పిల్లల పెంపకం, ఉద్యోగం మహిళల నిద్రలేమికి ముఖ్యకారణాలని అంటున్నారు. కెఫిన్, మద్యం కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు.

టీనేజర్ల నిద్రను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్‌లు!
టీనేజర్లు రాత్రిపూట 10 గంటలపాటు నిద్రపోతే మెదడు చురుకుగా పని చేయడంతో పాటు శారీరకంగా చురుకుగా ఉంటారు.
ఒకప్పుడు బెడ్‌రూమ్ అంటే విశ్రాంతికి చిహ్నంగా ఉండేవి. కానీ ఇప్పుడక్కడ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే నీలం రంగు వెలుతూరు కళ్లపై పడి నిద్ర రాకుండా చూస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

నిద్రపోయే సమయం దేశాల వారీగా..
ప్రతిదేశంలో నిద్రపోయే సమయం భిన్నంగా ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన 20 దేశాల్లో ప్రజలు ఎప్పుడు నిద్రపోతారనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఆ దేశాల సామాజిక అంశాలను, పనిచేసే గంటలను, స్కూళ్ల సమయాన్ని, అక్కడి ప్రజల అలవాట్లను పరిగణంలోకి తీసుకున్నారు.
ఈ దేశాల్లో ప్రజలు 7-8 గంటల వరకూ నిద్రపోతారని, నిద్ర పోయే సమయం రాత్రి 10-11-12 నుంచి పొద్దున్న6- 7 గంటల మధ్య ఉందని తేలింది.
టాంజానియా, నమీబియా, బొలివియా లాంటి తక్కువ విద్యుత్తు సరఫరా ఉన్న దేశాల్లో కూడా ప్రజలు 7.7గంటలు నిద్రపోతున్నారని తేలింది.

"data-width="100%" data-numposts="5">