కళ్యాణ్ రామ్ 118 Review -2.5/5

103

118-Movie-Review

నటీనటులు: కళ్యాణ్ రామ్
నివేదా థామస్
షాలిని పాండే
ప్రభాస్ శ్రీను
సురేఖావాణి
నాజర్

సాంకేతికవర్గం:
సంగీతం: శేఖర్ చంద్ర
మాటలు: మిర్చి కిరణ్
నిర్మాత: మహేష్ కోనేరు
కథ-స్క్రీన్ ప్లే-సినిమాటోగ్రఫీ-దర్శకత్వం:కె.వి.గుహన్
విడుదల తేది: మార్చి 1, 2019

కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కళ్యాణ్ రామ్.. సినిమాటోగ్రాఫర్ గుహన్ కి దర్శకుడిగా అవకాశమిచ్చి నటించిన చిత్రం ‘118’. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షిద్దాం.

కథ: ఓ టీవీ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేసే గౌతమ్ (కళ్యాణ్ రామ్) ని ఒక కల తరచూ వెంటాడుతూ ఉంటుంది. ఆ కలలో కనిపించినవి.. నిజంగానూ తారసపడుతూ ఉంటాయి. దాంతో.. అతను ఆ కలను చేజ్ చేసి, దాని వెనుక గల మిస్టరీ ఛేదించడం క్లుప్తంగా కథ.

నటీనటుల ప్రతిభ: 
కళ్యాణ్ రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డైలాగ్స్ మాడ్యులేషన్ పరంగానూ శ్రద్ధ తీసుకున్నాడు. కథను డ్రైవ్ చేసే ముఖ్య పాత్రలో ‘ఆద్య’గా నటించిన నివేదా కూడా నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న నివేదా.. అందులోనూ వేలెత్తి చూపించడానికి లేకుండా డబ్బింగ్ చాలా బాగా చెప్పింది. కళ్యాణ్ రామ్ లవర్ పాత్ర పోషించిన షాలిని పాండే కూడా.. తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. అయితే నటన పరంగా ఆమె పాత్రకు స్కోప్ తక్కువ. కళ్యాణ్ రామ్ కొలీగ్ పాత్రలో ప్రభాస్ శ్రీను తన సహజ శైలికి భిన్నంగా (గట్టిగా అరవడం, ఓవర్ యాక్షన్ చేయడం వంటివి చేయకుండా) మంచి నటన కనబరిచాడు. నాజర్, చమ్మక్ చంద్ర, సి.వి.ఎల్.నరసింహారావు, సురేఖా వాణి వంటివారవి.. రెండు మూడు సీన్స్ కి పరిమితమయ్యే పాత్రలు కావడంతో.. వారి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. విలన్ గ్యాంగ్ అంతా అంతగా పరిచయం లేనివారే అయినా అందరూ బాగా నటించారు.

సాంకేతిక ప్రతిభ:
మిర్చి కిరణ్ రాసిన డైలాగ్స్ సో సో గా ఉన్నాయి. శేఖర్ చంద్ర సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలకు ప్రాధాన్యత లేని ఈ చిత్రాన్ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక గుహన్ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రతి ఫ్రేమ్ ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దాడు. దర్శకుడిగానూ అతనికి మంచి మార్కులు వేయవచ్చు. అయితే.. అతను తయారు చేసుకున్న కథతోనే కాస్త తిరకాసు ఉంది. తనకు ప్రత్యక్షంగా సంబంధం లేని ఘటన హీరోని కలలా వెంటాడం.. డ్రీమ్స్ స్పెషలిస్ట్ సహకారంతో.. ఆ కల రీక్రియేట్ అయ్యేలా చేసుకుని.. ఏం జరిగిందీ తెలుసుకోవడం సగటు తెలుగు ప్రేక్షకులు జీర్ణం చేసుకోవడం కష్టమే. కథ కచ్చితంగా కొత్తగా ఉండాలనే అత్యుత్సాహంతో కల చుట్టూ అతను అల్లుకున్న కథతోనే ఇబ్బంది వస్తుంది. కల చుట్టూ కాకుండా.. ఇన్వెస్టిగేటివ్ టైప్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ లో తీసి ఉంటే.. ఫలితం ఇంకా బాగా ఉండేది.
నిర్మాణ విలువలు, ఇతర సాంకేతిక అంశాలు కూడా బాగానే ఉన్నాయి.

చివరిగా చెప్పాలంటే:కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే సినిమా

తెలుగు 24 రేటింగ్: 2.5/5