తెలుగు ఇపుడు ‘లెస్సు.. లెస్సు’! _ ఆంధ్రభూమి వ్యాసం

తెలుగంతా ఒకటే. ఒకప్పుడు తెలుగు ప్రాంతాలు వివిధ పరిపాలకుల పాలనల్లో ఉన్నందున పాలనా భాషలు వేర్వేరుగా ఉంటూ, పాలనా భాషలకు చెందిన పదాలు కలవడంతో తెలుగు భాష వేర్వేరుగా అనిపిస్తుంది. యాసల కలయిక వల్ల భిన్న ప్రాంతాల్లో తెలుగు విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆంగ్లేయుల ప్రభావం తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో కనపడుతుంది. మహమ్మదీల పాలనాప్రభావం తెలంగాణలో కనపడుతుంది. సంస్కృతం ప్రభావం తెలంగాణేతర తెలుగులో ఎక్కువ కనపడుతుంది, తెలంగాణ తెలుగుపై తక్కువ. దానికి కూడ ఆయా కాలాలలోని పరిపాలకుల పాలనా భాష లేక ఉపయోగ ప్రభావమేనని మనకు తెలుగు ప్రాంతాలను పాలించిన ప్రభువుల చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. ఉదాహరణకు కృష్ణదేవరాయని కాలంలో తను పాలించిన ప్రాంతపు తెలుగుపై సంస్కృతం ప్రభావం ఎక్కువగా ఉండేది. తెలంగాణ ప్రాంత తెలుగుపై సంస్కృతం ప్రభావం తక్కువ. తెలుగు వాళ్లు మాట్లాడే ప్రాంతాల తెలుగుపై పరిసర ప్రాంతాలైన ఒడిశా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ము న్నగు ప్రాంతాల భాషల ప్రభావం ఆయా తెలుగు భాషల యాసలో కనపడుతుంది.

మాండలికాల్లో, పలుకుబళ్లలో, దేశీయాల్లో, సామెతల్లో, సమాసాల్లో, ప్రతీకల్లో, ఉపమానాల్లో కూడా ఆయా ప్రాం తీయ తెలుగు భాషల్లో ప్రత్యేకతలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. వీటన్నింటి వలన తెలుగు భాష వేర్వేరని అనిపిస్తుం ది. కానీ వౌలికమైన భాషంతా ఒకటే. వౌలిక భాషా పదాలు ఎనభై శాతముంటే తక్కినవన్నీ కలిసి ఇరవై శాతాన్ని మించవు. ఏ తెలుగుకైనా తెలుగు అక్షరాలన్నీ ఒకటే కానీ వేర్వేరు కావు కదా! లిపిలో భేదం లేదు. సాహిత్యేతర తెలుగులో తేడా వుండడానికి వీలు లేదు. ఎందుకంటే సాహిత్యేతర, భాషేతర తెలుగు పరిభాషలోనే ఎక్కువుంటుంది కనుక. అది ఆయా విషయాలకు, విద్యలకు చెందిన తెలుగవుతుంది కనుక. ఆ తెలుగు ఏ ప్రాంతపు తెలుగైనా ప్రామాణికం కావాల్సి వస్తుంది కనుక. ప్రామాణికం కాకపోతే పరిపాలనకు, ఉద్యోగ నియామకాలకు, ఇంటర్ స్టేట్, ఇంట్రాస్టేట్ కమ్యూనికేషన్‌కు ఇబ్బందులు కలుగుతాయి కనుక. సెమినార్లు, సింపోజియమ్‌లు, డిబేట్‌లు, డిస్కషన్‌లు మున్నగువాటిలో ప్రామాణిక తెలుగునే వాడాల్సి వుంటుంది కనుక. ఎన్నో పరిభాషా పదాలు మనం సృష్టించుకున్నవి కాక ఇతర భాషలనుండి మన భాషలోకి వస్తాయి, రావాల్సి వుంటుంది కనుక. భాషను సుసంపన్నం చేసుకోవడానికి ఇతర భాషల నుండి మన భాషలోకి పదాలు తీసుకొచ్చుకోవాల్సి వుంటుంది. ఆదాన ప్రదానాలకు కూడా స్టాండర్‌డైజ్డ్ భాష అవసరముంటుంది. తెలంగాణ ప్రాంతపు తెలుగును అంతటా వాడితే అది అన్ని ప్రాంతాల వారికీ అర్థం కాదు. అలాగే మరో ప్రాంతపు తెలుగు వాడితే కూడా.

విద్యలకు చెందిన విషయప్రదమైన తెలుగంతా అన్నిచోట్లా ఒకే విధంగా వుండాల్సి వుంటుంది. అది తప్పదు. దానిలో ప్రాంతీయ పట్టుదలలు, పోకళ్లు ఎంతమాత్రం పనికిరావు. వాటివలన విద్యలకు, విద్యార్థులకు హాని కలుగుతుంది. వారి ఉద్యోగ అవసరాలకు, ఉన్నత అవసరాలకు, విదేశీ ఉన్నత విద్యల అవసరాలకు అనేకానేక ఇబ్బందులు కలుగుతాయి. ‘అన్ స్టాండర్‌డైజ్డ్’ తెలుగు అపహాస్యాలకు గురి అవుతుంది. అది ఎక్కడైనా కానీయండి.
మామూలు అవసరాలకు మాట్లాడే తెలుగు, ప్రతిరోజూ మాట్లాడుకునే తెలుగు ఆయా ప్రాంతాలకు వేర్వేరుగా వుండొచ్చు, వుంటుంది కూడా. అది తప్పదు. దానిని ప్రామాణికం చేయకూడదు. కాని విషయపరమైన తెలుగును తప్పనిసరిగా స్టాండర్‌డైజ్‌జ్డ్ చేయాలి. విషయ ప్రధానమైన తెలుగులో ‘సాహిత్య తెలుగు’ కూడా ఉంటుంది. సాహిత్య పరమైన పదాలు కూడా పరభాషా పదాలే. ఎవరిష్టం వచ్చినట్టు వారు వారికిష్టమొచ్చిన పదాలలో వ్రాస్తామంటే కుదరదు. సాహిత్యానికి చెందిన ‘స్టాండర్‌డైజ్డ్ వొకాబులరీ’ ఒకటుంటుంది. దానే్న ఉపయోగించాల్సి వుంటుంది. పాఠ్యాంశాల్లో, పుస్తకాల్లో ఆ పదాలే వాడాల్సి వుంటుంది. ఉపమానాలు, ప్రతీకలు, సమాసాలు, సామెతలు, పలుకుబళ్లు మున్నగునవి చాలావరకు అన్ని ప్రాంతాల సాహిత్యాల్లో కామన్‌గానే వుంటాయి, ఏవో కొన్ని తప్ప. కనుక సాహిత్య పదాలను కూడా ప్రామాణికం చేసుకోవాల్సి వుంటుంది.

ఎటొచ్చీ ప్రామాణికం చేసుకోవడంలో కొన్ని చర్చలు, సంప్రదింపులు అవసరమవుతాయి. వాటి కోసం ఒక కమిటీని కానీ, కమిషన్‌ను కానీ వేసుకుని విద్యాపరమైన, విషయపరమైన పదాలను ప్రామాణికం చేసుకోవాలి. ఆ పని ఎంత తొందరగా చేపడితే అంత మంచిది. దానికి వివిధ విద్యలకు, విషయాలకు (్ఫల్డ్స్‌కు, సబ్జెక్ట్స్‌కు) చెందిన కమిటీలను ఏర్పరిచి మొదట ఆయా ఫీల్డ్స్‌కు చెందిన సబ్జెక్ట్స్‌కు చెందిన భాషలను ప్రామాణికం చేసుకోవాలి. తదుపరి ‘టెర్మినలాజికల్’ పదాలను కనెక్టు చేసే సదరు సగటు తెలుగు భాషను కూడా. ఆ భాష కూడా ఈ ప్రాంతపు, ఆ ప్రాంతపు భాష అనకుండా అన్నిప్రాంతాలకు వర్తించే భాషను స్టాండర్‌డైజ్ చేసుకోవాలి. దానికి మరో కమిటీని వేసి తేల్చుకోవాలి. అపుడు కానీ మన తెలుగు భాషా ప్రతిపత్తి పెరగదు. అది విద్యలకు, వివిధ ఫీల్డ్స్‌కు సబ్జెక్ట్స్‌కు సరిపోదు.

ఈ పనులన్నీ ఇప్పటికి కొంతవరకూ తెలుగు అకాడమీ నిర్వహించింది. దాని పనిని ఇప్పుడు విస్తృతపరచి, దాని పాలక వర్గాన్ని విసిలతో కాక, తెలుగు యూనివర్సిటీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, కల్చరల్ డిపార్ట్‌మెంట్, వివిద విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు, సాహిత్య అకాడమీ మున్నగువాటి అధిపతులను మెంబర్స్‌గా వేసి, విసి లెవెల్ వారిని అధ్యక్షునిగా చేసి తెలుగు అకాడమీ డైరక్టర్‌ను దానికి రిజిస్ట్రార్‌గా చేసి ముఖ్యమంత్రి ఆ సంస్థను తన ప్రత్యక్ష పర్యవేక్షణకింద నడిపితే కాని సరైన మేరకు సీరియస్‌గా పని జరగదు.

అంతర్జాతీయంగా ప్రామాణికమైన భాషలన్నీ ముందంజ వేసినాయి, ఇంకా వేస్తునే వున్నాయి. వాటి పరిధి పెరిగింది. వాటిలో ఇతర భాషల పదాలు కూడా కలిసి అవి సుసంపన్నం అయ్యాయి. కాని మనం మాత్రం ఆ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం. భాష వెనుకబడితే, దానిని స్టాండర్‌డైజ్ చేసుకోకపోతే అది విద్యలకు, వివిధ విషయాలకు అంటే సబ్జెక్ట్స్‌కు, ఫీల్డులకు పనికిరాదని చెప్పి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం వైపు వెడుతున్నారు. అలాంటప్పుడు ‘తెలుగో.. తెలుగు..’ అని మొత్తుకునే కంటే అది ఎలా బతుకుతుంది? ఎవరైనా అంతటా అన్ని అవసరాలకు అక్కరకొచ్చే భాష కోరుతారు కాని మరో భాషనా? ఇంత సీరియస్ విషయాన్ని అటు ప్రభుత్వం పట్టించుకోక, ఇటు ప్రజలు పట్టించుకోకపోతే దాని పర్యవసానం ఏమవుతుందో అది అక్షరాలా కనబడుతునే ఉంది.కనుక మనం సంవత్సరానికొకసారి మేల్కొని భాషా దినోత్సవం జరుపుకోవడం కాదు చేయాల్సింది. మరెన్నో విషయాలను కూడా చాలా తీవ్రంగా పరిశీలించి ప్రభుత్వంతో పట్టుబట్టాలి. ఏదీ అది?