ఎవరేది అడిగినా ఇచ్చేయడమేనా? - వెల్చాల కొండలరావు గారి వ్యాసం

సందర్భం
మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధా కృష్ణన్, డా. సీహెచ్‌ హనుమంతరావు గారి లాంటి ఎందరో విజ్ఞులు, మేధావులు మాతృభాషలో విద్యాబోధన జరి గితేనే బాగుంటుందని దానికనుకూ లంగా ఎన్నో వ్యాసాలు రాశారు. కానీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలుగు మాధ్యమమే బాగుంటుందని నచ్చజెప్పకుండా, ‘‘వారు అడుగుతు న్నారు కనుక తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాము’’ అంటూ ప్రభుత్వం వ్యవహరి స్తోంది. ఎవరు ఏ మాధ్యమంలో చదవదలచుకుంటే వారికి ఆ మాధ్యమమే ఇస్తామని అనడం సామాజిక న్యాయానికి, ‘‘సామా జిక హక్కు’’కు పూర్తిగా వ్యతిరేకం. ఈ నిర్ణయం కొందరికి మేలు చేసేదే కానీ మొత్తం సమాజానికి మేలు చేసేది కాదు.

పాశ్చాత్య విద్యా విధానంలో ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధన అనేది తగిన విద్యా విషయక వాతావరణం, క్రమశిక్షణ, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, నిధులు మున్నగునవి విద్యా సంస్థలకు సమకూర్చడం, సమ్మెలు–ఉద్యమాలు లేకుండా విద్యా సంవత్సరం సాఫీగా సాగే పరిస్థితులు వగైరా కల్పించడం లాంటి అనేకానేక అంశాలతో కూడినది. మరి మన విద్యా సంస్థల్లో, ముఖ్యంగా మన ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో అలాంటివన్నీ ఉన్నాయా? మరి పాశ్చాత్య దేశాలలోని విద్యా సంస్థల్లో వలె మెరుగైన విద్యా విధానాలను, అవసరాలను సమకూర్చకుండా దానిలోని ఒక్క అంశాన్నే (ఆంగ్ల మాధ్యమం) విడిగా తీసికొని ప్రవేశపెడితే అది ప్రభుత్వం వాంఛించే ఫలితాలనిస్తుందా మరి?

ఒకప్పుడు ఇలాగే పాశ్చాత్య విద్యా విధానంలోని ఒకానొక అంశం మాత్రమే అయిన అంతర్గత మూల్యాంకనాన్ని (ఇంటర్నల్‌ ఎవాల్యుయేషన్‌) అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కానీ, తక్కిన అంశాలు లేనందువలన అది ఘోరంగా విఫలమయింది. మిగతా మార్పులేవీ చేయకుండా ఈ ఒక్క మార్పునే చేబట్టడం వ్యర్థమని దానిని విశ్వవిద్యాలయాలు హడావుడిగా చెత్తబుట్టలో పారేశాయి. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే కదా?

ప్రతి విద్యాసంస్థలో, ఆ సంస్థ ఏ స్థాయికి చెందిందో బేరీజు వేయకుండా ఆంగ్ల మాధ్యమాన్ని దానిలో ప్రవేశపెట్టి తిరిగి మనం అలాంటి పొరపాటే చేస్తున్నట్లు లెక్క. దీనివలన విద్యా నాణ్యత తరిగి, నిరుద్యోగం పెరిగి, వెంటనే కాకున్నా కొన్నాళ్లకైనా అసం తృప్తి, నిస్పృహ, నిరసన పెల్లుబికడం ఖాయం.

తగినన్ని వసతులు కల్పిస్తూ మాతృభాషలో (లేదా ప్రాంతీయ భాషలో) విద్యా బోధన చేయటం ఉత్తమమయిందని అత్యధికుల అభిప్రాయం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టదలచినా దానిని కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రవేశ పెడితే బాగుంటుందని; తొందరపడి అన్ని విద్యా సంస్థల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశపెట్టి విఫలమవడం కంటే దశల వారీగా దానిని ప్రవేశపెడితే బాగుంటుందని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.

ఈ విద్యావిషయాల గురించి ‘తెలుగు భాషా పరిరక్షణ సమితి’ కూడా అలాగే అభిప్రాయపడుతోంది. సమితి నిర్వహిం చిన ఎన్నో సదస్సుల్లో కూడా ఇదే అభిప్రాయం వెల్లడయింది, ఆ అభిప్రాయాన్ని అనుసరించి చర్యలు తీసుకోవడానికి ఇంకా వేళ మీరిపోలేదని ఈ వ్యాసం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.

ఆంగ్లంలో విద్యాబోధనతో సంభవించే కొన్ని ప్రమాదాలు :
1. ఒకేసారి ఇంగ్లిష్‌ భాష నేర్చుకోవడమంటే, దాని ద్వారా అన్ని సబ్జెక్ట్స్‌ చదువుకోవడమంటే ఎంతోమంది గ్రామీణుల, వెను కబడినవారి పిల్లలు వెనుకంజ వేయవచ్చు.
2. చేరినవారు మధ్య లోనే మానుకోవచ్చు
3. వారిలో చాలామంది ‘ఫెయిల్‌’ కావచ్చు
4. ఉత్తీర్ణులయిన వారిలో చాలామంది ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాలకు పనికిరాకపోవచ్చు
5. ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధించడానికి చాలా రోజుల వరకు తగినంతమంది అధ్యాప కులు లభించకపోవచ్చు
6. అదనంగా పుస్తకాలు, పత్రికలు మున్న గునవి ఇంగ్లిష్‌లో చదువజాలక, చదువనందున విద్యార్థులు వారి విద్యాప్రమాణాలు కోల్పోవచ్చు 7. విద్యాభారం చాలా పెరిగి పిల్లలు మానసిక ఒత్తిడికి గురై వారిలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవచ్చు.
8. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణులు కానివారి సంఖ్య పెరగవచ్చు. దానివలన వారు ఉన్నత విద్య ప్రవే శాలకు మరియు ఉన్నత ఉద్యోగాలకు పనికిరాకుండా పోవచ్చు
9. తెలుగు ఒక భాషగా మాత్రమే నేర్పితే దానిని విద్యార్థులు అంతగా పట్టించుకోకపోవచ్చు. దానికి సంస్కృత భాషకు పట్టిన గతే పట్టవచ్చు 10. వసతుల, వనరుల, సౌకర్యాల వ్యత్యాసాల వలన విద్యాసంస్థల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన విద్యా ప్రమాణాలు సంభవించవచ్చు.
ఆంగ్లేయ మాధ్యమం ఇంటర్మీడియేట్‌ తదుపరి ప్రవేశపెట్టి సాంకేతిక విద్యలకు పరిమితం చేస్తే బాగుంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లిష్‌ మీడియం వలన కష్టాల పాలయ్యేవారు చాలావరకు గ్రామీణ ప్రాంతాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు చెందిన వారే. వారు ఆర్థికంగా, సాంఘి కంగా, సాంస్కృతికంగా ముందుండే నగరాల విద్యార్థులతో ఇంగ్లిష్‌ భాషలో పోటీ పడలేరు. అందువలన వారిపై పెట్టుబడి వ్యర్థమై వారి తల్లిదండ్రులు అప్పులపాలు కావచ్చు.